ఉప్పల్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకుడు ఎస్.వి. కిట్టు తీవ్ర ఖండన
మల్లాపూర్ , నవంబర్ 13 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చేసిన వ్యాఖ్యలను మల్లాపూర్ కాంగ్రెస్ నాయకుడు ఎస్.వి. కిట్టు తీవ్రంగా ఖండించారు.తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మల్లాపూర్ సర్వే నెంబర్ 109లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సూర్ణం శివ అనే వ్యక్తి 90 గజాల భూమిని కబ్జా చేశారని, ఆ భూమిని కాపాడేందుకు ప్రహరి గోడ నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే చెప్పడం విడ్డూరమని పేర్కొన్నారు.
సూర్ణం శివ కాంగ్రెస్ నాయకుడు కాదు, టిఆర్ఎస్ (ప్రస్తుత బిఆర్ఎస్) నాయకుడు అని, దీనికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఎస్.వి. కిట్టు తెలిపారు. బిఆర్ఎస్ నాయకులే కబ్జాలు చేస్తూ, కాంగ్రెస్ నేతలపై ఆరోపణలు చేయడం ఎమ్మెల్యేకు తగదని విమర్శించారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వ భూములను కాపాడిందని గుర్తు చేస్తూ, భూకబ్జా కాకుండా ప్రహరి గోడ నిర్మాణానికి తాము స్వాగతం పలుకుతున్నామని, అయితే కాంగ్రెస్ నేతలపై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని ఆయన సూచించారు.


Comments