నషాముక్తు భారత్ అభియాన్ అవగాహన సదస్సు.!
సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో పలు కార్యక్రమాలు.
సత్తుపల్లి, నవంబర్ 18 (తెలంగాణ ముచ్చట్లు):
మండల పరిధిలోని బి.గంగారం గ్రామం సాయిస్ఫూర్తి అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో నషాముక్తు భారత్ అభియాన్–5 సంవత్సరాల ప్రయోజనార్థం మాదకద్రవ్యాల దుర్వినియోగం నివారణపై అవగాహన సదస్సు మంగళవారం జరిగింది. మొదటి సంవత్సరం అన్నీ ఇంజనీరింగ్ శాఖల విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్–కళాశాల జాతీయ సేవా పథకం సంయుక్తంగా నిర్వహించాయి. కార్యక్రమ వివరాలను జాతీయ సేవా పథకం కార్యక్రమాధికారి బలుసుపాటి సీతారాములు వెల్లడించారు.
కార్యక్రమంలో దాసరి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, మాదకద్రవ్యాలు యువత శారీరక–మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపి, గుండె, కాలేయం, ఊపిరితిత్తుల సమస్యలకు దారి తీస్తాయని తెలిపారు. గుర్తుంచుకునే శక్తి తగ్గిపోవడం, ఆలోచనా బలహీనత, విద్య–ఉద్యోగ భవిష్యత్తు దెబ్బతినడం వంటి ప్రమాదాలను హెచ్చరించారు. ఫ్యాషన్, స్నేహితుల ఒత్తిడి, మానసిక ఒత్తిడి కారణంగా యువత వీటికి ఆకర్షితులవుతున్నారని చెప్పారు. “ఎవరైనా మత్తు పదార్థం ఇచ్చినా ధైర్యంగా నో చెప్పాలి. స్నేహితులను తప్పుదారిలోనుంచి కాపాడటం ప్రతి విద్యార్థి బాధ్యత” అని పిలుపునిచ్చారు. క్రీడలు, యోగా, జ్ఞానం, సంగీతం, పుస్తకాలు, సేవా కార్యక్రమాలు ఆరోగ్యకరమైన జీవనశైలికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు.
ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ సూపర్వైజర్లు ఇ.గంగాజలం, వి.సుజాత, ఆర్.రజనీ, ఎన్.రమాదేవి మాట్లాడుతూ, మాదకద్రవ్యాల ముప్పు తగ్గించడంలో విద్యార్థుల భాగస్వామ్యం అత్యవసరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేశారు.
మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ–2025:
“మాదకద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతాను. డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తాను. నాతోపాటు ఎవ్వరూ డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తాను. డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు, అక్రమ రవాణా వివరాలను సంబంధిత అధికారులకు తెలియజేస్తాను. తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న డ్రగ్స్ రహిత సమాజ సంకల్పంలో భాగస్వామిని అవుతాను.”
కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది ప్రసాద్, విజయ్ పాల్గొన్నారు.
సైన్స్–హ్యుమానిటీస్ విభాగాధిపతి షేక్ మీరాసాహెబ్ మాట్లాడుతూ, మాదకద్రవ్యాల వాడకం చట్టరీత్యా నేరమని, ఇతరులను వాడమని ప్రోత్సహించినా కఠిన చర్యలు తప్పవని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లోపంతో విద్యార్థులు స్నేహితుల ప్రభావానికి లోనై మాదకద్రవ్యాల వైపు మొగ్గుచూపుతున్నారని, ఇది వారి భవిష్యత్తుతోపాటు కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో దాసరి ప్రభాకర్ రెడ్డి, ప్రిన్సిపాల్ వూటుకూరి శేషారత్నకుమారి, విభాగాధిపతులు, జాతీయ సేవా పథకం కార్యక్రమాధికారి బలుసుపాటి సీతారాములు, అధ్యాపకులు, నాన్–టీచింగ్ సిబ్బంది, విద్యార్థిని–విద్యార్థులు పాల్గొన్నారు.


Comments