పశుపతినాథ్ దేవస్థానంలో కార్తీక సోమవారం ప్రత్యేక పూజలు
సామూహిక పంచామృత మహారుద్రాభిషేక0 సాయంత్రం ఆకాశ దీపార్చన
ఎల్కతుర్తి, నవంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు):
ఎల్కతుర్తి మండలం వల్భాపూర్ గ్రామంలోని శ్రీ పశుపతినాథ్ దేవాలయంలో కార్తీకమాసం చివరి సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం బ్రహ్మముహూర్తం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకొని పంచామృతంతో సామూహిక మహా రుద్రాభిషేకంలో పాల్గొన్నారు.
వేదపండితులు సదానిరంజన్ సిద్ధాంతి ఆధ్వర్యంలో మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి బిల్వదళాలతో అర్చనలు జరగగా, ఆలయం ఆవరణం “ఓం నమః శివాయ”, “ఓం శ్రీ పశుపతినాథాయ నమః” నినాదాలతో మార్మోగింది. మహిళా భక్తులు దీపాలు వెలిగించి స్వామివారి దర్శనం చేసుకున్నారు.
సాయంత్రం ఆరు గంటలకు ఆకాశదీప ప్రజ్వలన, ఈశ్వరలింగ దీపార్చన, అష్టోత్తర శతనామార్చన ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
కార్తీకమాసం చివరి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించడం పుణ్యప్రదమని అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమాల నిర్వహణలో శివాలయ కమిటీ, యువకులు, మహిళా భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments