పదిహేనేళ్లుగా పెండింగ్ లో ప్లాట్లు...భూమి హద్దుల కోసం నాగారం లబ్ధిదారుల పోరాటం
నాగారం, నవంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్ నియోజకవర్గం కీసర మండలం నాగారం గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 84/2, 85/2, 86/2, 87/2లో గల మొత్తం 330 ప్లాట్లకు సంబంధించిన భౌతిక పొజిషన్ ఇవ్వాలని లబ్ధిదారులు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కి విజ్ఞప్తి చేశారు.2009 ఫిబ్రవరి 2వ తేదీన బి/2006/2006 నంబర్‌తో అప్పటి పార్లమెంట్ సభ్యులు సర్వే సత్యనారాయణ లబ్ధిదారులకు 60 గజాల ప్లాట్లకు పట్టా సర్టిఫికేట్‌లు అందజేశారు. కానీ అప్పటి నుంచి దాదాపు 15 సంవత్సరాలు గడిచినా కూడా భూమిపై పొజిషన్ చూపించక పోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు బొలారం ఎల్లమ్మ, పంగ మంజుల, వై. సంగీత, అయ్యాగల్ల భాగ్యమ్మ, కిష్టా వరలక్ష్మి, జి. హేమలత, బాస భాగ్యరేఖ, ఎ. బాగ్యలక్ష్మి తదితరులు మాట్లాడుతూ—“మాకు ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు ఉన్నా భూమిపై యాక్సెస్ లేదు. ఎక్కడ మా ప్లాట్ ఉందో తెలియక నిర్మాణం కూడా చేపట్టలేము. పదేళ్లకు పైగా అధికారులు, గ్రామపంచాయతి, రెవెన్యూ శాఖ చుట్టూ తిరుగుతున్నాం. ఇప్పుడు కలెక్టర్ మా సమస్యను పరిష్కరించగలరు” అని ఆవేదన వ్యక్తం చేశారు.ప్లాట్లకు సంబంధించిన వివరణాత్మక పత్రాలను కలెక్టర్ కార్యాలయానికి అందజేసిన లబ్ధిదారులు, రెవెన్యూ శాఖ లోనే భూమి హద్దులను చూపించి, పట్టా ప్రకారం పొజిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.గ్రామ ప్రజలు కూడా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా పరిపాలనను కోరుతున్నారు.


Comments