మహాసభలను జయప్రదం చేయాలి.!
మహిళా హక్కుల పరిరక్షణకు ఐద్వా పిలుపు.
సత్తుపల్లి, నవంబర్ 14 (తెలంగాణ ముచ్చట్లు):
స్థానిక పట్టణంలో రావి వీర వెంకయ్య భవనంలో ఐద్వా డివిజన్ కమిటీ సమావేశం చెరుకు రత్నకుమారి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి తన్నీరు కృష్ణవేణి మాట్లాడుతూ, మహిళలపై హింస, దాడులు, అత్యాచారాలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం అనుమతిస్తోన్న మద్యం, మాదక ద్రవ్యాలే మహిళలపై దాడులకు కారణమవుతున్నాయని చెప్పిన ఆమె, వీటిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల మహిళలకు ప్రయోజనం కలిగేలా ఫ్రీ బస్ సర్వీసులను పెంచాలని, అలాగే మహిళలకు ఇస్తామని ప్రకటించిన రూ.2500 సహాయాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు.
మహిళా సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు శీలం కరుణ మాట్లాడుతూ, జనవరి 25 నుండి 28 వరకు హైదరాబాదులో జరిగే అఖిలభారత మహాసభలను విజయవంతం చేయడానికి గ్రామాల వారీగా ఐద్వా జెండా ఆవిష్కరణలు నిర్వహించి ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో సహాయ కార్యదర్శి జాజిరి జ్యోతి, మిట్టపల్లి నాగమణి, రాణి రుద్రమ్మదేవి, పెరసాని లలిత, భూలక్ష్మి, కరిష్మా, ప్రభావతి, కే.వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.


Comments