కోటి మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు పంపిణీ ప్రారంభం
పారదర్శకతతో నిర్వహించాలని సీఎం ఆదేశాలు
మేడ్చల్–మల్కాజిగిరి కలెక్టర్, నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు)
ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. తెలంగాణ సంప్రదాయంలో భాగంగా ఆడబిడ్డలకు చీరను అందించే ఆచారాన్ని కొనసాగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలిపారు.ప్రతి నియోజకవర్గానికి ఓ ప్రత్యేక అధికారిని నియమించి, మండల కేంద్రాల్లో పండగ వాతావరణంలో చీరల పంపిణీ జరగాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నవంబర్ 19 నుంచి డిసెంబర్ 9 వరకు, పట్టణ ప్రాంతాల్లో మార్చి 1 నుంచి 8 వరకు ఇందిరమ్మ చీరల పంపిణీ కొనసాగనున్నట్లు వివరించారు.మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, యూనిఫాం కుట్టుపని బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించడం, ఇందిరమ్మ క్యాంటీన్లు, శిల్పారామంలో 3 ఎకరాల్లో ‘ఇందిరా మహిళా శక్తి బజార్’ ఏర్పాటు వంటి పలు మహిళా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు సీఎం వెల్లడించారు. మహిళల తయారీ ఉత్పత్తులకు జాతీయ–అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే కాక, కోటి మహిళలను కోటీశ్వరులుగా మార్చడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు.చీరల పంపిణీ ప్రక్రియలో ఏ విధమైన వివాదాలకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని అన్ని జిల్లా కలెక్టర్లను సీఎం ఆదేశించారు.
ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వాకాటి శ్రీహరి, సలహాదారు వేం. నరేందర్ రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, వివిధ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా తరఫున కలెక్టర్ మనుచౌదరి, అదనపు కలెక్టర్లు రాధికా గుప్తా, విజయేందర్ రెడ్డి,డీఆర్డీఓ సాంబశివరావు, మున్సిపల్ కమిషనర్లు, మహిళాశక్తి సంఘ సభ్యులు పాల్గొన్నారు. 


Comments