సర్వజ్ఞ విద్యార్థుల యోగాసన ప్రజ్ఞ! పతకాల పంట
ఖమ్మం బ్యూరో, అక్టోబర్ 14, తెలంగాణ ముచ్చట్లు;
ఖమ్మం పట్టణం వీడీవోస్ కాలనీలో గల సర్వజ్ఞ పాఠశాల విద్యార్థులు యోగాసన పోటీల్లో అద్భుతమైన ప్రదర్శనతో పతకాల పంట పండించారు. రాష్ట్ర స్థాయి యోగాసన పోటీల్లో అండర్-8 విభాగంలో పాల్గొన్న ఈ చిన్నారులు స్వర్ణ మరియు రజత పతకాలను కైవసం చేసుకుని పాఠశాలకు, ఖమ్మం జిల్లాకు గొప్ప కీర్తిని తెచ్చారు.
'ఆది యోగా పరమేశ్వరా యోగా ఫౌండేషన్' ఆధ్వర్యంలో అక్టోబర్ 12, 2025 ఆదివారం రోజున హైదరాబాద్‌లోని మణికొండలో గల భాష్యం బ్లూమ్స్ స్కూల్ వేదికగా ఈ రాష్ట్ర స్థాయి పోటీలు జరిగాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి వచ్చిన ప్రతిభావంతులైన విద్యార్థులతో పోటీపడి, సర్వజ్ఞ పాఠశాల విద్యార్థులు తమ యోగాసనాలలో పరిపూర్ణత, ఏకాగ్రత మరియు సమన్వయాన్ని ప్రదర్శించారు.
ఈ సందర్భంగా సర్వజ్ఞ పాఠశాల ఛైర్మన్ ఆర్.వి. నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ, యోగా అనేది కేవలం వ్యాయామం కాదని, అది మనస్సు, శరీరం మరియు ఆత్మల సంపూర్ణ సమన్వయానికి నిదర్శనమని ఈ చిన్నారులు తమ విజయంతో నిరూపించారు. మా విద్యార్థులు చిన్న వయస్సులోనే యోగాలో ఇంతటి గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శించడం గర్వకారణం. ఈ విజయం కేవలం పతకాల రూపంలోనే కాదు, క్రమశిక్షణ, ఏకాగ్రత మరియు అంకితభావానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నాము.
అనంతరం పాఠశాల కరెస్పాండెంట్ నీలిమ మాట్లాడుతూ యోగా అంటే శారీరక విన్యాసం మాత్రమే కాదు, అది మన మనస్సును, శరీరాన్ని ఒక తాటిపై నడిపించే ఒక అద్భుతమైన విద్య అని వివరించారు. అనంతరం వారికి శిక్షణ ఇచ్చిన యోగా గురువును, నిరంతరం ప్రోత్సహించిన తల్లిదండ్రులకు ప్రత్యేక అభినంధనలు తెలియజేశారు. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మా విద్యార్థులు పతకాలు సాధించాలని కోరుకుంటున్నాం" అని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో సత్తా చాటి, పతకాలు సాధించిన ఈ చిన్నారులను పాఠశాల ఛైర్మన్ మరియు ప్రిన్సిపాల్స్ ఘనంగా అభినందించారు.


Comments