పత్తి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగజేయవద్దు
అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంముగాణ చ్చట్లు:
జిన్నింగ్ మిల్లులకు వచ్చే పత్తి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగజేయకుండా నాణ్యమైన పత్తిని మద్దతు ధరపై కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం అదనపు కలెక్టర్ ఖమ్మం రూరల్ మండలం గుర్రాలపాడు గ్రామంలోని జి.ఆర్.ఆర్. ఇండస్ట్రీ, తల్లంపాడు గ్రామంలోని శ్రీ బాలాజీ, పొన్నెకల్ గ్రామంలోని జి.ఆర్.ఆర్. జిన్నింగ్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు ప్రక్రియ, ఎంత సమయం తీసుకుంటుంది, తేమ పరీక్ష లను అదనపు కలెక్టర్ తనిఖీ చేసి, రైతులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు 3 వేల 648 మంది రైతుల నుంచి 8 వేల 487 మెట్రిక్ టన్నుల పత్తి మద్దతు ధరపై కొనుగోలు చేయడం జరిగిందని అన్నారు. రైతులు జిన్నింగ్ మిల్ వద్ద ఎదురుచూసే అవకాశం రానివ్వకుండా ఉదయం పూట వచ్చిన నాణ్యమైన పత్తిని ఆ రోజే కొనుగోలు చేస్తున్నామని అన్నారు.
పత్తి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. పత్తి పంట 8 శాతం తేమ ఉంటే క్వింటాళ్ల 7521 రూపాయల మద్దతు ధర వస్తుందని, 8 నుంచి 12 శాతం వరకు పెరిగే ఒక్కో శాతానికి 75 రూపాయల చొప్పున క్వింటాళ్లుకు మద్దతు ధర తగ్గించడం జరుగుతుందని, 12 కంటే ఎక్కువ తేమ శాతం ఉంటే కొనుగోలు చేయబోమని అదనపు కలెక్టర్ రైతులకు తెలిపారు. పత్తి రైతులందరూ తమ యొక్క పత్తి తేమ శాతం 8 నుంచి 12 లోపు ఉండే విధంగా చూసుకుని కొనుగోలు కేంద్రాలకు తీసుకొని రావాలని, మంచి పత్తి చెడు పత్తి కల్వకుండా వేర్వేరుగా తీసుకొని రావాలని అదనపు కలెక్టర్ కోరారు. ఇప్పటివరకు కొనుగోలు పత్తి, ఎంతమంది రైతులు, సరాసరి తేమ, సరాసరి ధర చెల్లించింది పూర్తి నివేదిక సమర్పించాలన్నారు.
ఈ తనిఖీలలో అదనపు కలెక్టర్ వెంట జిల్లా మార్కెటింగ్ అధికారి ఎం.ఏ. అలీం, సిసిఐ ప్రతినిధి అవినాష్, మార్కెట్ కార్యదర్శులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, వీరాంజనేయులు, వ్యవసాయ విస్తరణ అధికారులు ఆదర్శ్, హిమబిందు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Comments