పాలేరు దాటొద్దు...!
- నియోజకవర్గంలోని నాలుగు మండలాల అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశాలు
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
తెలంగాణ వ్యాప్తంగా మరో రెండు మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో పాలేరు నియోజక వర్గంలోని నాలుగు మండలకు చెందిన ఎంపిడిఓ లు, ఎమ్మార్వోలు, ఎంపీఓలు, స్పెషల్ ఆఫీసర్లు, విద్యుత్ శాఖ తో పాటు ఇతర శాఖల ముఖ్యాధికారులందరు నియోజక వర్గంలోనే ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అన్ని మండలాల్లో పరిస్థితిని ఆయా సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు కావాల్సిన చర్యలు చేపట్టాలన్నారు. ఎప్పటికప్పుడు తాజా పరిస్థితిని తనకు ఫోన్ లేదా మెసేజ్ ద్వారా అందించాలని ఆదేశించారు. వర్షాలు తగ్గుముఖం పట్టేంత వరకు తనకు తెలియకుండా నియోజకవర్గ పరిధి దాటి వెళితే వారి పై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.


Comments