సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ తరగతులు.!
అసిస్టెంట్ ఇంజనీర్ తెలంగాణ ట్రాన్స్కో, వై. విజయ్ చరణ్.
సత్తుపల్లి, సెప్టెంబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి మండల పరిధిలోని గంగారం స్వయంప్రతిపత్తి కలిగిన సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం గెస్ట్ లెక్చరర్ తరగతులు నిర్వహించారు. ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (ఈఈఈ) రెండవ, మూడవ సంవత్సరం విద్యార్థినీ, విద్యార్థులకు కళాశాల ఈఈఈ విభాగాధిపతి కోటా రామకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ తరగతులు జరిగాయి.
ఈ సందర్భంగా 132/33 కేవీ సబ్ స్టేషన్ పై తెలంగాణ ట్రాన్స్కో అసిస్టెంట్ ఇంజనీర్ వై. విజయ్ చరణ్ విద్యార్థులకు కూలంకుషంగా వివరణ ఇచ్చారు. సబ్ స్టేషన్ నిర్మాణం, నిర్వహణ, పరికరాలు, డిస్ట్రిబ్యూషన్, మెయింటెనెన్స్ మొదలైన అంశాలపై అవగాహన కల్పించారు.
అతను మాట్లాడుతూ, సాధారణంగా పవర్ జనరేషన్ స్టేషన్‌లో విద్యుత్తు ఉత్పత్తి అవుతుందని, కానీ సబ్ స్టేషన్‌లో మాత్రం ఉత్పత్తి జరగదని, దాని పాత్ర ప్రసారం లేదా పంపిణీ కోసం ఎక్కువ లేదా తక్కువ వోల్టేజ్‌గా విద్యుత్తును మార్చడమేనని చెప్పారు. సబ్ స్టేషన్లు వోల్టేజ్ స్థాయిలను ఒకటి నుండి మరొకదానికి మార్చడం, ఏసీని డీసీగా లేదా డీసీని ఏసీగా మార్పు చేయడం వంటి కీలక విధులను నిర్వహిస్తాయని వివరించారు.
అదేవిధంగా విద్యుత్ సబ్ స్టేషన్లు ఉత్పత్తి కేంద్రాలు మరియు వినియోగదారుల మధ్య జంక్షన్ పాయింట్‌లా పని చేస్తాయని, విద్యుత్తును సురక్షితంగా, విశ్వసనీయంగా పంపిణీ చేయడంలో అవి ప్రధాన పాత్ర పోషిస్తాయని తెలిపారు.
కళాశాల సెక్రటరీ & కరస్పాండెంట్ దాసరి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఇటువంటి గెస్ట్ లెక్చరర్ తరగతుల ద్వారా విద్యార్థులు ప్రత్యక్ష అనుభవం పొందుతూ సబ్జెక్ట్‌పై లోతైన అవగాహన సాధిస్తారని, చదువుపై మరింత ఆసక్తి పెరుగుతుందని అన్నారు.
కళాశాల ప్రిన్సిపాల్ టుకూరి శేషారత్నకుమారి మాట్లాడుతూ, ఇలాంటి తరగతులు ఇండస్ట్రియల్ బోధన అందుబాటులోకి రావడానికి దోహదం చేస్తాయని, విద్యుత్ రంగానికి ఈఈఈ విద్యార్థులే వెన్నెముకవంటివారని అన్నారు.
ఈఈఈ విభాగాధిపతి కోటా రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, విద్యార్థులు మాత్రమే కాకుండా ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా ప్రత్యేకమైన మెలకువలు నేర్చుకున్నారని తెలిపారు.


Comments