ఆశ వర్కర్స్ పై వేధింపులు నిలిపివేయాలి
ఆన్లైన్ పనులు రద్దు చేయాలి
మేడ్చల్, అక్టోబర్ 9 (తెలంగాణ ముచ్చట్లు)
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లాలోని ఆశా వర్కర్స్ ఆన్లైన్ పనుల పేరుతో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అధికారులు చేస్తున్న వేధింపులపై ఈ ధర్నా జరిగింది.జిల్లా యూనియన్ అధ్యక్షురాలు కామ్రేడ్ ఏ. హేమలత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి ఉన్నికృష్ణన్, యూనియన్ జిల్లా కార్యదర్శి ఎం. రేవతి కళ్యాణి మాట్లాడారు.ఆశ వర్కర్స్ తో ఆన్లైన్ పనులు చేయించకూడదని, ఇప్పటికే చేసిన సర్వేలకు సంబంధించిన బకాయి చెల్లింపులు వెంటనే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. మండల అధికారులు ఆశ వర్కర్స్ పై సబ్ సెంటర్ ఓపి డ్యూటీలను బలవంతం చేస్తున్నారని, ఇది నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు.ఉన్నికృష్ణన్ మాట్లాడుతూ, “ఓపి డ్యూటీలు ఏఎన్‌ఎంలు, డాక్టర్లు, ఎంఎల్‌హెచ్‌పీల బాధ్యత. ఆశ వర్కర్స్ ఫీల్డ్ వర్క్ లో ఉండాలి. అయినా అధికారులు రిజిస్టర్ రాయమని బలవంతం చేస్తున్నారు,” అన్నారు.
ఎం. రేవతి కళ్యాణి మాట్లాడుతూ, “స్పుటం టెస్టులు, టీబీ పేషెంట్ల డబ్బాలు మోసేలా వేధింపులు చేస్తున్నారు. ఇది ఆరోగ్యానికి హానికరం. అలాగే ఎన్‌ఎస్‌డీ ప్రోగ్రాంలో పెద్ద పుస్తకాలలో రాయమని ఒత్తిడి చేస్తున్నారు. ఇవి ఎఎన్‌ఎంలు చేయాల్సిన పనులు,” అన్నారు.ఆశ వర్కర్స్ పై జరుగుతున్న నిరంతర వేధింపులను తీవ్రంగా ఖండిస్తూ, జిల్లా కలెక్టర్ మరియు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కోమలత, రాధా, జయ వసంత, యాదమ్మ, కవిత, అనిత, సబియా తదితరులు పాల్గొన్నారు.


Comments