న్యాయమూర్తులు,న్యాయవాదుల మద్య సత్సంబంధాలతోనే బాధితులకు న్యాయం
జస్టిస్ సి. ప్రవీణ్ కుమార్
హనుమకొండలో రెండవ రోజు ఐఏఎల్ రాష్ట్ర మహా సభలు
హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు:
కోర్టులలో న్యాయమూర్తులు,
న్యాయవాదుల మధ్య సత్సంబంధాలు మాత్రమే బాధితులకు సరైన న్యాయం అందించగలవని ఏపీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి. ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆదివారం హనుమకొండ హరిత కాకతీయ హోటల్‌లో జరుగుతున్న ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ (ఐఏఎల్) తెలంగాణ రాష్ట్ర మహాసభల రెండవ రోజు ‘న్యాయమూర్తులు, న్యాయవాదుల సంబంధాలు - వృత్తిపరమైన నైతిక విలువలు’ అన్న అంశంపై జరిగిన సదస్సులో జస్టిస్ ప్రవీణ్ కుమార్ ముఖ్యఅతిథిగా ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో ఐఏఎల్ జాతీయ ప్రధాన కార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్ అధ్యక్షత వహించారు. జస్టిస్ ప్రవీణ్ కుమార్ కోర్టుల్లో సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులకు మార్గదర్శకత్వం ఇవ్వాలని, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, వాదనా పటిమను పెంపొందించాలని సూచించారు. “చైతన్యవంతమైన నిపుణత కలిగిన బార్ నుండే ఉత్తమమైన జడ్జీలు పుట్టుకొస్తారు” అని ఆయన చెప్పారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సిహెచ్ రమేష్ బాబు, హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నిర్మలా గీతాంబా తదితరులు కూడా ప్రసంగించారు. వారు కోర్టుల గౌరవాన్ని కాపాడే విధంగా న్యాయవాదులు తమ పని చేయాలని, న్యాయవ్యవస్థ విలువలను గౌరవించమని చెప్పారు.
న్యాయవాదులకు రక్షణ చట్టం అమలు చేయాలి
రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు దుస్సా జనార్ధన్ ప్రభుత్వాన్ని కోరుతూ, న్యాయవాదుల రక్షణ కోసం తక్షణమే ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ, “న్యాయవాదుల ఆరోగ్య భీమా, రిటైర్డ్ న్యాయవాదులకు పెన్షన్, సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం సాయం చేయాలని” చెప్పారు.ఈ కార్యక్రమంలో ఝార్ఖండ్ బార్ కౌన్సిల్ సభ్యుడు రషీద్, ఇతర సీనియర్ న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు, ఐఏఎల్ నాయకులు పాల్గొన్నారు.


Comments