మార్వాడీ గో బ్యాక్ ఉద్యమానికి కేయూ జేఏసీ సంపూర్ణ మద్దతు
మన రాష్ట్రంలో మన వ్యాపారం, మన ఉద్యోగాలు నినాదం
-ఆగస్టు 20న బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఉద్యమ ఆవిర్భావసభ
-బొల్లికొండ వీరేందర్,కేయూ జేఏసీ అధ్యక్షులు
హైదరాబాద్,ఆగస్టు19(తెలంగాణ ముచ్చట్లు):
రాజధాని హైదరాబాదు బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆగస్టు 20న మధ్యాహ్నం రెండు గంటలకు “పానీ పూరీ – మార్వాడీ గో బ్యాక్” ఉద్యమ ఆవిర్భావ సభ జరగనుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉద్యమ నాయకుడు డా. పిడమర్తి రవి ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహించనున్నట్లు కేయూ జేఏసీ అధ్యక్షుడు బొల్లికొండ వీరేందర్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో “మన రాష్ట్రంలో మన వ్యాపారం – మన వ్యాపారాలలో మన ఉద్యోగాలు” అనే నినాదంతో ఈ సభ నిర్వహించబడనుందని ఆయన వివరించారు. బతుకుదెరువు కోసం వచ్చి ఆర్థికంగా బలపడ్డ ఉత్తరాది మార్వాడీలు స్థానిక వ్యాపారులపై పెత్తనం చూపడం, వ్యాపారరంగాల్లో ఆధిపత్యం ప్రదర్శించడం అంగీకారయోగ్యం కాదని వీరేందర్ విమర్శించారు.
అలాగే మార్వాడీలు నిర్వహించే వ్యాపారాల్లో తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా నిరుద్యోగులుగా మిగిల్చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అన్యాయానికి ప్రతిఘటించే ఉద్దేశంతో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయనున్నట్లు వెల్లడించారు.ఈ సభకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి వర్తక సంఘాలు, స్థానిక వ్యాపారులు, ప్రజా సంఘాలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని బొల్లికొండ వీరేందర్ పిలుపునిచ్చారు.


Comments