ఒకవైపు అద్భుతమైన చౌరస్తా
మరోవైపు గుంతలతో నిండిన రహదారి
ఎల్కతుర్తి,అక్టోబర్22(తెలంగాణ ముచ్చట్లు):
ఎల్కతుర్తి మండల కేంద్రంలోని చౌరస్తాను అధికారులు ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. పూల మొక్కలు, పచ్చదనం, రాత్రివేళ వెలుగులు చిమ్మే లైట్లతో చౌరస్తా అందంగా కనిపిస్తోంది. అయితే అదే చౌరస్తాకు కూతవేటు దూరంలో ఉన్న ఎల్కతుర్తి–హుస్నాబాద్ ప్రధాన రహదారి మాత్రం దారుణ పరిస్థితుల్లో ఉంది.
మధ్యలోనే రహదారి పనులు ఆపివేయడంతో దుమ్ము,ధూళి, గుంతలతో మారుమూల గ్రామాల రోడ్లకంటే దారుణంగా మారిపోయింది. ప్రధాన రహదారి కావడంతో తరచూ వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.
ఎన్ని ప్రమాదాలు జరిగినా, ఎన్ని సార్లు ప్రజలు ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రహదారిని వెంటనే పూర్తి చేసి ప్రజలకు ఉపశమనం కల్పించాలని వారు కోరుతున్నారు.

దుమ్ము,ధూళితో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం స్థానికురాలు ఎండి యాకూబి స్థానికురాలు ఎండి యాకూబి మాట్లాడుతూ…“ఎల్కతుర్తి–హుస్నాబాద్ రహదారి మధ్యలోనే ఆపేయడంతో దుమ్ము ధూళితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. తినే ఆహార పదార్థాల్లో కూడా దుమ్ము పడుతోంది. ఊపిరి పీల్చుకోవడమే కష్టంగా మారింది. ఈ రహదారి వెంటనే పూర్తి చేయాలని అధికారులను కోరుతున్నాం” అని వాపోయారు.


Comments