మొహమ్మద్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లమ్) సర్వమానవాళికి రుజుమార్గం చూపారు
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
జమాఅతె ఇస్లామీ హింద్ ఖమ్మం శాఖ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు జైనుల్ పాషా అధ్యక్షతన జరిగిన సభ్యుల మరియు కార్యకర్తల సమావేశం లో ముఖ్య అతిథిగా పాల్గొన్న జమాత్ ఇస్లామీ హింద్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అబ్దుల్ మజీద్ షోయబ్ మాట్లాడుతూ మొహమ్మద్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లమ్) ముస్లింల కొరకు మాత్రమే కాకుండా సర్వమానవాళికి రుజుమార్గం చూపేందుకు పుట్టారని అన్నారు. 1500 సంవత్సరాల క్రితం అనైతికతకు మూర్ఖత్వానికి ఆలవాలమైన అరబ్బు సమాజాన్ని ఆయన తన నైతిక బోధనలతో ఉత్తమ సమాజంగా, సుందర సమాజంగా తీర్చిదిద్దారని, ఆయన బోధనలు ఆనాడు ఈనాడు ప్రళయం వరకు కూడా మానవులకు దిశా నిర్దేశం చేస్తాయని, మానవ జీవితానికి సంబంధించిన అన్ని రంగాల యొక్క సమస్యలకు పరిష్కారం చూపగలవని అన్నారు. తనకోసం కాకుండా, అనునిత్యం ప్రపంచ మానవుల సంక్షేమం కోసం పాటుపడిన, కృషి చేసిన త్యాగనిరతి మొహమ్మద్ ప్రవక్త ( సఅసం) అని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన జీవితాన్ని తప్పక అధ్యయనం చేయాలని, ఆయన ఆదర్శ కారుణ్య జీవితంలో నుండి స్ఫూర్తి పొందాలని, నేటి మానవ సమస్యలకు ఆయన సూచించిన మార్గాన నడిచి పరిష్కారాలు గైకొనాలని కోరారు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు సల్లం ప్రవచనాలను అనుసరించి మనిషి వ్యక్తిగత మరియు సామూహిక జీవితాలను చక్కదిద్దుకోవాలని అన్నారు. అనంతరం రాష్ట్ర మాజి కార్యదర్శి మొహమ్మద్ ఇలియాస్ మాట్లాడుతూ విమర్శనాత్మకంగా ఆయన జీవితాన్ని అధ్యయనం చేసిన వారు సైతం ఆ మహా ప్రవక్తకు వీరాభిమానులుగా మారిపోయినంత ఉన్నత ఆదర్శవంతమైన జీవితం మొహమ్మద్ ప్రవక్త వారిదని తెలియజేశారు. ఆయన జీవిత గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామి హింద్ నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు అక్బర్ హుస్సేన్, ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు అబ్దుల్ ముజీబ్, జిల్లా ఉపాధ్యక్షులు అబ్దుల్ సమి, ఖిల్లా, ఇంద్రనగర్, ఇస్లాంపేట అధ్యక్షులు అబ్దుల్ మలిక్, అబ్రార్ అలీ, షేక్ రఫీ, సభ్యుల అబ్దుస్ సుబూర్, అక్బర్ మూసా , యూసఫ్ షరీఫ్, ఇంతియాజ్, అబ్దుల్ రజాక్, గౌస్ ,షెక్ ఇలియాస్, అబ్దుల్ లతీప్, హాది, నిజాముద్దీన్, ఫయాజ్, మొయినుద్దిన్, ఎంపీజే జిల్లా అధ్యక్షులు షేక్ ఖాసిం, జిల్లా మహిళా అధ్యక్షురాలు అస్మా అన్జుమ్ మహిళా శాఖ ఖిల్లా, ఇంద్రనగర్ , ఇస్లాంపేట అధ్యక్షురాల్లు అస్ఫీయ అన్జుమ్, హుస్సేన్ బీ, ఖాసిమ షాహిన్, సమీనా, నుసరత్, హాజీర సదఫ్, నస్రీన్ నాజియా తబస్సు , ఫర్జానా , నసీమా, జహీరా నూర్జహాన్ ఆరిఫా, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.


Comments