ఎల్కుర్తి శివారులో సైనిక్ పాఠశాల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలి
పేద విద్యార్థుల బకాయి ఫీజులను విడుదల చేయాలి
విద్యాశాఖకు వెంటనే మంత్రి నియమించాలి
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
మండల కేంద్రంలో శుక్రవారం అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ధర్మసాగర్ మూడవ మండల మహాసభ బీ. హేమంత్ అధ్యక్షతన నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి భాష బోయిన సంతోష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ధర్మసాగర్ మండలం ఎల్కుర్తి శివారులోని భూ సర్వె నెంబర్ 160లో సైనిక పాఠశాల ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చి, 50 ఎకరాల భూమిని రెవెన్యూ శాఖ సర్వే చేసి మంజూరు చేసిందని తెలిపారు. అయితే, ప్రభుత్వం మారిన తర్వాత కొత్త ప్రభుత్వం పాత ప్రతిపాదనను రద్దు చేసి, సైనిక పాఠశాలను సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోకి తరలించేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. దీనిపై తక్షణమే స్పందించి శాసనసభ సభ్యుడు కడియం శ్రీహరి చొరవ తీసుకుని ధర్మసాగర్ మండలంలోనే సైనిక పాఠశాల నిర్మాణ పనులు ప్రారంభించాలని కోరారు. లేదంటే ఆయన ఇంటిని ముట్టడి చేస్తామని హెచ్చరించారు.
అలాగే వర్షాకాలం నేపథ్యంలో సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు తడిసిపోతున్నారని, కిటికీలకు తలనెత్తులు లేవని, గోడలు శిథిలావస్థలో ఉన్నాయని, వర్షపు నీరు గదుల్లోకి వస్తోందని తెలిపారు. వసతి గృహాల్లో కొత్త భవనాలు నిర్మించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అలాగే, పెండింగులో ఉన్న పేద విద్యార్థుల బకాయి ఫీజులు, వేతన సహాయం విడుదల చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, సహాయ సిబ్బందిని నియమించాలని, తగిన మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. వర్షాకాలంలో పాఠశాలల పరిసరాలు శుభ్రంగా లేకపోవడం వల్ల దోమలు, పాములు, ఈగలు వంటి సమస్యలు తలెత్తుతున్నాయని, శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
అదే విధంగా, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలఫీజులను నియంత్రించే నిబంధనలు పటిష్ఠంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రైవేటు సంస్థలు విద్యను వ్యాపారంగా మార్చుతున్నాయని, తద్వారా సామాన్య విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. తగిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంఘ సభ్యులు, మండల కార్యదర్శి శ్రీపతి వినయ్, నాయకులు వై. రితీష్, ఎం. ఈశ్వర్, చింతల సాత్విక్, అక్కిరెడ్డి సంతోష్, కొల్లు అభినయ్, దేవులపల్లి విశాల్, ఎండి. మహేష్, కంచె అజయ్, జోగు సాహిత్, తాళ్లపల్లి అరవింద్, సుంకరి సాయి తదితరులు పాల్గొన్నారు.


Comments