అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యకు ప్రత్యేక చర్యలు
– జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలల వినియోగం
-21 జిల్లాల్లో 61 పాఠశాలల గుర్తింపు
– 34 పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం
-సెప్టెంబర్ 1లోపు తరగతుల ప్రారంభానికి జిల్లా అధికారులకు ఆదేశాలు
-ప్రైవేటు ప్లే స్కూల్ల స్థాయిలో నాణ్యమైన విద్య అందిస్తున్న అంగన్‌వాడీలు
-చిన్నారుల బంగారు భవిష్యత్తుకు పునాది వేస్తున్నామని మంత్రి సీతక్క స్పష్టం
హైదరాబాద్,ఆగస్టు18(తెలంగాణ ముచ్చట్లు):
రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికి ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టింది. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. ప్రస్తుతానికి అనేక అంగన్‌వాడీ కేంద్రాలు ఒకే గదిలో నడుస్తుండటంతో ప్రీ-ప్రైమరీ తరగతులను నిర్వహించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి జీరో ఎన్రోల్మెంట్ ఉన్న ప్రభుత్వ పాఠశాలలను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 21 జిల్లాల్లో 61 ప్రభుత్వ పాఠశాలలను గుర్తించారు. అందులో 34 పాఠశాలలు అంగన్‌వాడీ కేంద్రాలకు సమీపంలో ఉండటంతో పైలట్ ప్రాజెక్ట్‌గా వాటిలో అంగన్‌వాడీ కేంద్రాలను తరలించి, పూర్వ ప్రాథమిక విద్యా తరగతులు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ జీ. సృజన జిల్లా అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. పాఠశాలల ప్రస్తుత పరిస్థితులను తక్షణమే పరిశీలించి, అనుకూలంగా ఉంటే జిల్లా విద్యా అధికారులతో సమన్వయం చేసి భవనాలను అంగన్‌వాడీల కోసం వినియోగించాలని ఆదేశాలు ఇచ్చారు. సెప్టెంబర్ 1లోపు ఈ ప్రక్రియను పూర్తి చేసి తరగతులను ప్రారంభించాల్సిందిగా సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, “దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య అందిస్తున్నాం. ప్రైవేటు ప్లే స్కూల్లకు ఏమాత్రం తీసిపోకుండా అంగన్‌వాడీలు పిల్లలకు నాణ్యమైన విద్య, సంరక్షణ అందిస్తున్నాయి. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి ప్రీ-ప్రైమరీ సామర్థ్యాన్ని పెంచి పిల్లలను ప్రాథమిక విద్యకు సిద్ధం చేస్తున్నాం” అని తెలిపారు.
చిన్నారి జీవితంలో ప్రారంభ దశలో ఇచ్చే సరైన సంరక్షణ, విద్య వారికి జీవితాంతం సానుకూల ఫలితాలు ఇస్తాయని అనేక అధ్యయనాలు వెల్లడించాయని మంత్రి గుర్తుచేశారు. అందుకే పూర్వ ప్రాథమిక విద్యను అంగన్‌వాడీల ద్వారా అందిస్తూ ప్రతి చిన్నారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామని అన్నారు. అంతేకాక, జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలను వినియోగించడం ద్వారా ఈ పథకాన్ని మరింత విస్తరించి రాష్ట్రంలోని ప్రతి చిన్నారికి నాణ్యమైన ప్రారంభ విద్య అందించడం ప్రభుత్వ లక్ష్యమని సీతక్క స్పష్టం చేశారు.


Comments