ఓటరు జాబితా ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం పూర్తిచేయాలి
-జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
ఓటరు జాబితా సవరణ-2025 ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవిన్యూ అధికారులతో ఓటరు జాబితా సవరణ, ప్రజావాణి అర్జీల పరిష్కారం పై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హత గల ప్రతిఒక్కరు ఓటుహక్కు పొందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ నెల 20 నుండి 18 అక్టోబర్ వరకు బూత్ స్థాయి అధికారులచే హౌజ్ తో హౌజ్ వేరిఫికేషన్, పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్, సెక్షన్ల రికాస్టింగ్ తదితర ప్రక్రియ లు పూర్తయ్యేలా చూడాలన్నారు. 19 అక్టోబర్ నుండి 28 అక్టోబర్ వరకు ఫార్మాట్ 1 నుండి 8 ల తయారు, ఇంటిగ్రేటెడ్ డ్రాఫ్ట్ రోల్ తయారుచేయాలన్నారు. 29 అక్టోబర్ న ఇంటిగ్రేటెడ్ డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ పబ్లికేషన్ చేయాలన్నారు. 29 అక్టోబర్ నుండి 28 నవంబర్ వరకు అభ్యంతరాలు స్వీకరించాలని, 24 డిసెంబర్ లోగా అభ్యంతరాల పరిష్కారం చేపట్టాలని, 6 జనవరి, 2025 న తుది ఎలక్టోరల్ రోల్ పబ్లికేషన్ చేయాలని కలెక్టర్ తెలిపారు. బూత్ స్థాయి అధికారుల ఖాళీలు ఉంటే వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. నియామకం లో మార్గదర్శకాలు పాటించాలన్నారు. ఇంటింటి ధ్రువీకరణ లో జాగ్రత్తలు తీసుకోవాలని, 10 మంది కంటే ఎక్కువ ఉన్న ఇంట్లో క్రొత్త వారి నమోదు, లేనివారి తొలగింపు నిబంధనల మేరకు చేయాలన్నారు. కొత్త ఓటర్ల నమోదులో 1 జనవరి 2025 నాటికి 18 సంవత్సరాలు నిండే వారినీ పరిగణనలోకి తీసుకోవాలన్నారు. దరఖాస్తుల ఆమోదం, తిరస్కరణలకు సంబంధించి ఆధారాలు పటిష్టంగా ఉండాలన్నారు. పోలింగ్ కేంద్రాలు ప్రయివేటు భవనాల్లో ఉన్నవి, ప్రభుత్వ భవనాల్లో ఉండి, శిథిలావస్థలో ఉన్నవి, ఓటర్లకు 2 కి.మీ. దూరంలో ఉన్న పోలింగ్ కేంద్రాల మార్పుకు సంబంధించి ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. ఆక్జిల్లరి పోలింగ్ కేంద్రాలను క్రొత్త పోలింగ్ కేంద్రాలుగా ప్రతిపాదనలు పంపాలన్నారు. దరఖాస్తుల పరిష్కారం పెండింగులో లేకుండా చూడాలన్నారు.
మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి స్పందన బాగుందని, కలెక్టరేట్ కు వచ్చే అర్జీలు చాలా తగ్గాయని కలెక్టర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అర్జీల సమర్పణ పెరిగిందని, నమ్మకంతో వచ్చే అర్జీదారులకు న్యాయం చేయాలని ఆయన అన్నారు. ప్రజావాణి లో మండల స్థాయి అధికారులు తప్పక హాజరుకావాలని, హాజరు నివేదికలో అధికారి స్థాయి పొందుపర్చాలని ఆయన తెలిపారు. శుక్రవారం కల్లా వచ్చిన అర్జీల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. అర్జీదారులు అధికారుల స్పందనతో సంతృప్తి చెందేలా చూడాలని ఆయన అన్నారు. మండల అభివృద్ధి అధికారి కార్యాలయాల్లో ప్రజాపాలన కౌంటర్ల పునరుద్ధరణ చేయాలన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, ఇంచార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, డిఆర్డీవో సన్యాసయ్య, జిల్లా రెవెన్యూ అధికారిణి ఎం. రాజేశ్వరి, కల్లూరు ఆర్డీవో ఎల్. రాజేందర్, జిల్లాలోని తహశీల్దార్లు, నాయబ్ తహశీల్దార్లు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.


Comments