జింఖానా గ్రౌండ్ లో మహా ధర్నాకు సిద్ధం కావాలి
సమగ్ర శిక్షా ఉద్యోగులకు అండగా ఉంటా.!!
పది రోజుల్లోగా ఉద్యోగులకు న్యాయం జరగాలి
సమగ్ర శిక్షా ఉద్యోగుల నిరసన దీక్షలో డాక్టర్ కే ఏ పాల్
ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:
తెలంగాణ రాష్ట్ర సమగ్ర శిక్షా ఉద్యోగుల న్యాయబద్ధమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని లేనిపక్షంలో హైదరాబాదులోని జింఖానా గ్రౌండ్లో 20వేల మంది ఉద్యోగులతో మహాధర్న నిర్వహిస్తానని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ కే ఏ పాల్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఖమ్మం కలెక్టరేట్ వద్ద గత 25 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నసమగ్ర శిక్షా ఉద్యోగుల శిబిరాన్ని శనివారం ఆయన సందర్శించి వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి సమగ్ర శిక్షా ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని చేసిన హామీ నిలుపుకోవాలని , చాలి చాలని వేతనాలతో ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతుంటే కనీసం వారికి న్యాయం చేయకపోగా గత 25 రోజులుగా దీక్షలు చేస్తున్న కూడా పట్టించుకోకపోవడం అవకాశవాది రాజకీయమని విమర్శించారు. వచ్చే పది రోజుల్లోగా ఉద్యోగులకు న్యాయం చేయాలని వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని లేనిపక్షంలో తమ్ముడు రేవంత్ రెడ్డికి తను అంటే ఏమిటో చూపిస్తానని హెచ్చరించారు. సమగ్ర శిక్షా ఉద్యోగులకు ప్రజాశాంతి పార్టీ అండగా ఉంటుందని, రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించేందుకు సిద్ధం కావాలని, గ్రూప్ ల వారిగా ఏర్పడి గ్రామంలో ఉన్న ప్రజలను ఐక్యం చేసి ప్రజాశాంతి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని, గెలుపొందిన గ్రామంలో 100 రోజుల్లో సమగ్ర అభివృద్ధి చేసి చూపిస్తానని భరోసా ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సమగ్ర శిక్షా ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని లేనిపక్షంలో హైదరాబాద్ జింఖానా గ్రౌండ్లో తలపెట్టే మహా ధర్నా నిర్వహించి తమ తడాకా చూపిస్తామని హెచ్చరించారు.


Comments