మధురానగర్‌లో ఈటల రాజేందర్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్
జూబ్లీహిల్స్, నవంబర్ 8 (తెలంగాణ ముచ్చట్లు):
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ తరఫున విస్తృతంగా ప్రచారం కొనసాగిస్తున్న ఎంపీ ఈటల రాజేందర్ శుక్రవారం మధురానగర్‌లోని స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్నారు. కార్యక్రమంలో స్థానిక నేతలు, కార్యకర్తలు, ప్రజలు భారీగా హాజరయ్యారు.ఈటల రాజేందర్ మాట్లాడుతూ :“ఏడు రోజులుగా బస్తీల్లో తిరుగుతున్నా ప్రజల పరిస్థితి చూసి మనసు కలిచివేస్తోంది. పేరుకే జూబ్లీహిల్స్ అంటారు కానీ పైన పటారం, లోన లోటారం. బస్తీల్లో ప్రజలు దుర్భరమైన జీవితం గడుపుతున్నారు. మనం నిల్చున్న మధురానగర్‌లో కూడా కంపు కొడుతోంది. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ప్రజల అభివృద్ధి పూర్తిగా అణగారిపోయింది” అని విమర్శించారు.కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండూ ప్రజలకు ఏం చేయలేదని ఈటల మండిపడ్డారు.
“ఎన్నికల సమయంలో ఒకరినొకరు విమర్శించుకోవడం తప్ప ప్రజల కోసం పని చేసిన దాఖలాలు లేవు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలకు ఏమైంది? మహిళలకు 2500, ఆటోడ్రైవర్లకు 12 వేలు, నిరుద్యోగులకు నెలకు 4 వేల భృతి, పెన్షన్ 4 వేల, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ 10 వేల కోట్లు పెండింగ్ — ఇవన్నీ అడగండి. వాగ్దానాలు చేయడమే తప్ప నెరవేర్చడంలో మాత్రం విఫలమయ్యారు” అన్నారు.ప్రజా డబ్బుతో రాజకీయ ప్రయోజనం కోసం ఓటు కొనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈటల తీవ్రంగా విమర్శించారు.“ఓటుకు రెండు వేల రూపాయలు పంచుతున్నారట. ఇది ఎవరి అబ్బ సొమ్ము? డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇవ్వకపోగా, హైడ్రా పెట్టి పేదల గుడిసెలు కూలుస్తున్నారు.
ఈ అన్యాయాలను అడ్డుకునేది ఒక్క బీజేపీ మాత్రమే” అని ధ్వజమెత్తారు.దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం అవసరమని ఈటల పేర్కొన్నారు.“ప్రజలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా జీవించాలంటే మోదీ నాయకత్వం కొనసాగాలి. ధర్మం, న్యాయం, పేదల ఆత్మగౌరవం కోసం పోరాడేది బీజేపీ మాత్రమే. జిహెచ్ఎంసీలో 48 సీట్లు గెలిచిన బీజేపీ మళ్లీ ప్రజా ఆశీర్వాదంతో ఎగురబోతోంది” అని అన్నారు.చివరగా ప్రజలను ఉద్దేశించి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేస్తూ “ఓటు కోసం ఇస్తే తీసుకోండి కానీ వోటు మాత్రం మీ ఆత్మగౌరవం కోసం వేయండి. హుజురాబాద్‌లో ప్రజలు ఆత్మ గౌరవం కోసం ఓటు వేసినట్లే, ఇక్కడ కూడా పేదవాళ్లం కానీ మన గౌరవం తక్కువ కాదని నిరూపించండి. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డిని గెలిపించండి” అని పిలుపు నిచ్చారు.కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


Comments