48 గంటల్లో గన్ని సంచుల సరఫరా ....
అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డి
ఖమ్మం బ్యూరో, నవంబర్ -8, తెలంగాణ ముచ్చట్లు;
ధాన్యం కొనుగోలుకు అవసరమైన మేర గన్ని బ్యాగులు అందుబాటులో ఉన్నాయని, ప్రతిపాదనలు పంపిన 48 గంటల లోపు కొనుగోలు కేంద్రాలకు గన్ని సంచులు సరఫరా చేస్తున్నామని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ -2025 ధాన్యం కొనుగోలుకు సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేశామని అదనపు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన మేర గన్ని సంచులు, టార్ఫాలిన్ కవర్లు అందుబాటులో పెట్టడం జరిగిందని అన్నారు. ధాన్యం కొనుగోలు అవసరాలకు మాత్రమే గన్ని సంచులు అందించడం జరుగుతుందని, రైతుల ఇంటి వద్దకు గన్ని సంచులు ఇవ్వవద్దని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఇప్పటివరకు 9 లక్షల 71 వేల 500 గన్ని సంచులు పంపిణీ చేశామని అన్నారు. గన్ని సంచుల కోసం కొనుగోలు కేంద్రాలు ఇండెంట్ పెట్టిన 48 గంటల లోగా సరఫరా చేస్తున్నామని, గన్ని సంచులకు జిల్లాలో ఎక్కడా కొరత లేదని అదనపు కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


Comments